ఆంధ్రా ఆడపడుచు... అమెరికా ఉద్యగం, అనుభవాలు, అనుభూతులు...
Tue Mar 10, 2020 13:53 Rachanalu (రచనలు), U S Aఆంధ్రా ఆడపడుచు... అమెరికా ఉద్యగం, అనుభవాలు, అనుభూతులు...
ఈ శీర్షికన ప్రముఖ మరియు ప్రఖ్యాత రచయిత్రి చిరపరిచితులు అయినటువంటి శ్రీమతి మంజు యనమదల గారు తాము అమెరికాలో గడిపిన రోజులలోని అనుభవాలు, అనుభూతులు, సమస్యలు మొదలైనవి అన్ని కుడా పంచుకోనున్నారు. ఈ రచనల ద్వారా కొత్తగా వెళ్ళే వారికీ ఉపయోగకరం గాను మరియు ప్రవాసులకు తాము అనుభవిస్తున్న ప్రతి సంఘటనను ఈ రచనలలో చూసుకొని వారి తీపి మరియు చేదు జ్ఞాపకాలను నేమరువేసుకోవటానికి ఉపయోగపడుతుందని భావిస్తూ మొదలు పెడుతున్నాము.
ఎప్పటివలె ప్రవాసులు అందరు కుడా ఈ రచనలను ఆదరించి మంజు గారిని మరియు అంధ్ర ప్రవాసి ని ప్రోత్సహిస్తారని భావిస్తున్నాము. అదే విధగా ప్రతి ఒక్కరు కుడా మీ అనుభవాలను కుడా మాతో పంచుకుంటే మేము తప్పకుండా వాటిని కుడా ప్రచురిస్తాము. ఇలా చేయడం ద్వారా చాలా మందికి ఉపయోగ పడుతుందని, అవగాహన పెరుగుతుందని మా ఈ చిన్ని ప్రయత్నం.
ఇక పోతే రచయిత్రి మంజు యనమదల గారి పరిచయం...
అక్షరమే ఆటవిడుపు_అలుపెరుగని జీవితపు ఆటలో....!! అంటూ అక్షర భావాలతో మనసు మాటలను, మౌన భావాలను, గతపు జ్ఞాపకాలను, గుండె చప్పుళ్లను అక్షరాలతో నింపడంలోనూ, రాహిత్యం నుండి సాహిత్యం జనిస్తుందన్న భావనలు నిజమని తన రాతలకు ఊపిరి పోసిన అక్షరంతో పాటు ఆవిడకు అతిశయం కాస్త ఎక్కువే. అమ్మలా అక్కున చేర్చుకున్న అక్షరం ఆమెకిచ్చిన ఊరట, అందించిన అభిమానాలు వెల కట్టలేనివి. తిలక్ అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలైతే ఆవిడ అక్షరాలు ఆమెను ఆమెకే చూపే ఆవిడ అంతర్నేత్రాలు అని అనుకుంటారు. మాటలు, మౌనాలు, జ్ఞాపకాలు, అనుబంధాలు ఇలా అన్నింటితో పెనవేసుకున్న మనసాక్షరాలతో చెలిమిని పంచుకున్న భావనలే ఆమె రాతలు. కవితలుగా, కథనాలుగా, వ్యాసాలుగా, ఏక వాక్యాలుగా, మాలికలుగా ఇలా విభిన్న ప్రక్రియలలో ఆవిడ మనసులోని భావాలను వెలువరిస్తూ అనారోగ్యంతో మగతలో పడుతున్న మెదడుని చేతనావస్థలోనికి తీసుకువచ్చే ప్రయత్నంలో నే సాగిస్తున్న (మ)రణ యుద్ధమే ఈ అక్షర పోరాటం. అవిడలానే ఆమె అక్షరాలకు అలుపు లేదు. శరీరానికి సాయమందించాల్సిన కణాలే హాని చేస్తుంటే వాటితో నిరంతరం పోరాడుతూ అక్షరాల ఆసరాతో అనునయాలను వెదుక్కుంటూ ఎందరి మనసులనో తడుముతున్న ఆమె అక్షరాలంటే అందరికి అమితమైన ప్రేమే.
అవరోధం అనేది ఒక మనిషి ఎదుగుదలకు అడ్డంకి కాదని, జీవితంలో గెలుపుకి సోపానమని ఆమె అనుకుంటారు. అన్ని సవ్యంగా సాగితే విజయం అందుకోవడం సులభమే. అపసవ్యాలు, అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కుంటూ అంపశయ్య వరకు వచ్చిన జీవితాన్ని అక్షరాలతో గెలవడం అనుకున్నంత సులభమేమి కాదు. ఎర్ర బస్ కూడా లేని ఓ చిన్న మారుమూల పల్లెటూరి నుంచి ఎయిర్ బస్ వరకు సాగిన మంజు గారి జీవితంలో ఐదు తరాలను చూసిన అనుభవాలు ఇవి.
నాన్నకు గారాలపట్టిగా అందరికి ఇష్టురాలిగా అమ్మానాన్నలకు ఏకైక సంతానంగా అమ్మమ్మ తాతయ్యలతో, అల్లారుముద్దుగా సాగిన బాల్యం. అవనిగడ్డ శిశువిద్యామందిరంలో 6వ తరగతి వరకు చదువు, తరువాత విజయనగరం జొన్నవలస ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు, తరువాత విజయనగరం మహారాజ మహిళా కళాశాలలో ఇంటరు, ఆ తరువాత బళ్లారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువు. మద్రాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం, అవనిగడ్డ పాలిటెక్నీక్ కాలేజ్ లో లెక్చరర్ గా, తరువాత అమెరికాలో ఏడున్నర్ర సంవత్సరాలు సాఫ్ట్ వేర్, ఇతర ఉద్యోగాలు. మళ్ళీ స్వదేశానికి వచ్చాక హైదరాబాద్ లో ప్రాజెక్ట్, క్వాలిటీ మేనేజర్ గా పని చేసి, ఇంటి బాధ్యతలతో ఉద్యోగం మానేసి తరువాత కొంత కాలం మళ్ళీ ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం అనారోగ్య కారణంగా ఉద్యోగం మానేసిన మంజు యనమదల గారి గురించిన వివరాలు ఇవి.
చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా ఇష్టమైన అలవాటు. తన రెండో తరగతి నుంచి పుస్తకాలు చదవడం అలవాటై ఆ అలవాటే ఏ చిన్న సంఘటన జరిగినా అలాగే పుస్తకాల్లో రాయడం మొదలైంది. కనిపించిన ఏ పుస్తకం కాని, పేపర్ కాని వదలకుండా చదివేయడం, లైబ్రరికి వెళ్ళి అక్కడి పుస్తకాలూ వదలకుండా చదివేయడం ఆదో పెద్ద వ్యాపకమప్పుడు. వీరి నాన్నకు నాటక రచయితగా, నటునిగా ప్రవేశం ఉంది. అందుకేనేమో తనకు కాస్త సాహిత్యం వంటబట్టి ఉంటుంది. స్నేహితులు ఎక్కువగా ఉండటం, స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా వీరు విజయనగరం వెళ్లినా తన చిన్నప్పటి స్నేహితులకు ఉత్తరాలు రాయడంతో మొదలైన రాతలు ఇప్పటికి ఇలా సాగుతూనే ఉన్నాయి అని కొన్ని సందర్భాలలో చెపుతుంటారు.. ఏదో పుస్తకాలు చదవడం, మనసుకు అనిపించింది రాయడం మాత్రమే తెలిసిన తనకు సాహిత్యపు లక్షణాలు కాని, మూలాలు కాని తెలియదు అని కూడా గర్వం లేకుండా చెప్పుకుంటారు. రాసినదేది అచ్చులో చూసుకోవాలన్న కోరిక కూడా లేదు. అడపా దడపా పుస్తకాల్లో రాయడమే కాని ఏ పత్రికకు పంపలేదు. ఆహ్వానం అనే సాహితీ మాస పత్రికలో అచ్చులో చూసుకున్న తన మొదటి కవిత "మౌనం". అని అంటారు.
అమెరికా నుండి వచ్చేసాక వీరి ట్రస్ట్ కోసం బ్లాగు మొదలు పెట్టి, దానితోపాటుగా కబుర్లు కాకరకాయలు అన్న మరో బ్లాగులో తన రాతలు రాయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1800 పై చిలుకు పోస్ట్లు వీరి బ్లాగులో ఉన్నాయి.
వీరి రాతలన్నీ ఎక్కువగా ప్రతికూల పరిస్థితుల్లో రాసినవే అంటారు. వారి ఇంట్లో అమ్మవాళ్లకు ఈ రాతలు రాయడం ఇష్టం ఉండేది కాదు అని, ఏ కాస్త సమయం దొరికినా ఎవరు చూడకుండా గబగబా రాసేయడం, హమ్మయ్య రాసేసాను అనుకోవడం. వీరికి రాయడం అంటే ఎంత ఇష్టమో అని తెలియాలి అంటే వీరికి ఒక సారి 20 నిముషాలు బ్రెయిన్ డెడ్ అయ్యి 3 గంటలు ఏమి తెలియని స్థితి నుంచి బయటపడిన తరువాత కూడా మంజు గారు రాయడం మానలేదు. డాక్టర్ ఇంట్లో వాళ్ళకు తన సంతోషానికి తనని వదిలేయండి అని చెప్పాక, వీరి రాతలను ఇష్టపడుతున్న ఎందరినో చూసాక అప్పుడు తన రాతలకు అడ్డంకి లేకుండా పోయింది. పుస్తకాలు చదివి ఎవరైనా మారతారా అని అనుకుంటాం, కానీ వీరి రాతలకు వచ్చే కొన్ని స్పందనలు ఎంత ఆనందాన్నిస్తాయో మాటల్లో చెప్పడం కష్టం.
"మేము అనుకున్నది మీరు రాసారు, మా మనసులో భావాలు ఉన్నదున్నట్టుగా రాసారు, మీ భావాలు చదివి మేము చాలా మారాము ఇలా ఎంతోమంది పెద్దలు, పిన్నలు చెప్తుంటే ఆ అందానికి కొలమానమేముంటుంది.” అని చాల సంతోషం గా చెప్పుకుంటారు.
అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు, చెదరని శి(థి)లాక్షరాలు, అక్షర స(వి)న్యాసం అనే కవితా సంపుటాలు, గుప్పెడు గుండె సవ్వడులు అనే కవితా సంపుటి తను, తన నేస్తం వాణి కలిపి వేసిన కవితా సంపుటి. సడిచేయని (అ)ముద్రితాక్షరాలు, అంతర్లోచనాలు వ్యాస సంపుటాలు , ఏ'కాంతా'క్షరాలు అనే లఘు కవితా ప్రక్రియ 28 అక్షరాల్లో రెండు వాక్యాలుగా రాయడం, ఇప్పటి వరకు ముద్రితమైన వీరి పుస్తకాలు.
ఇంతటి మంచి రచయిత అయిన మంజు యనమదల గారు ఆంధ్రా ప్రవాసి డాట్ కాం కు, అమెరికాలో తన 8 ఏళ్ళ అనుభవాలను వ్యాస రూపంలో మన ముందుకు తీసుకురావడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించి, మీ సహకారాన్ని, సూచనలను అందించండి.
అదే విధంగా మేము అభ్యర్ధించిన వెంటనే, ఆంధ్ర ప్రవాసి కొరకు ప్రత్యేకం గా తమ రచనలను వ్రాయటానికి అంగికరించినందుకు ఆంధ్రా ప్రవాసి తరపున మంజు గారికి ప్రత్యక కృతజ్ఞతలు...
ఆంధ్రా ఆడపడుచు... అమెరికా ఉద్యగం, అనుభవాలు, అనుభూతులు., manju-yanamadala.
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.