ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా...

Header Banner

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా...

  Sat Mar 21, 2020 16:31        U S A, Rachanalu (రచనలు)

ఇక్కడ మరో నాలుగు మాటలు చెప్పాలి. H1 వీసా కోసం నా మార్క్స్ లిస్ట్లన్నీ.. 10, ఇంటర్, ఇంజనీరింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్ పేపర్స్ అమెరికాకి విజయవాడలో పోస్టాఫీసు లో పోస్ట్ చేయడం. ఆ తర్వాత హైదరాబాదులో 6 నెలలు JAVA, ASP, VC++ నేర్చుకుంటూ, కార్ డ్రైవింగ్ కూడ నేర్చుకున్నా. ఓ రోజు వీసా పేపర్స్ వచ్చాయని కబురు వస్తే అమీర్పేట్ లో ఆఫీస్ కి వెళ్ళి పేపర్స్ తీసుకున్నా. తర్వాత 4,5 రోజుల్లోనే వీసా స్టాంపిగ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ 2 సెట్స్ జిరాక్స్, ఒరిజినల్ పేపర్స్ అన్నీ తీసుకుని మద్రాస్ వెళ్ళాం నేను, మావారు.బాంక్లో 2 డి డి లు తీసుకున్నాం. 

హోటల్ నుండి రాత్రి రెండింటికి వెళ్ళి క్యూలో నించోవడం, తర్వాత నేను లోపలికి వెళ్ళడం, అప్లికేషన్ పూర్తి చేయడం, వీసా వస్తుందో, రాదోనన్న టెన్షన్ ఓ పక్క.. ఇలా ఎవరి గొడవలో వాళ్ళం ఉన్నాం. నా టోకెన్ నెంబర్ పిలవగానే వాళ్ళు చెప్పిన విండో దగ్గరకు వెళ్ళాను. లేడి ఉన్నారు కౌంటర్లో. వాళ్ళు ముందే చెప్పిన  పేపర్స్ అన్నీ వాళ్ళిచ్చిన ఫైల్ లో పెట్టి ఇచ్చాను. వర్క్ చేయడానికి వెళుతున్నారా అని అడిగారు. అవునని చెప్పాను.

ఫీజ్ కట్టి వెళ్ళండి అని చెప్పారు. నిజమా కాదా అని మరోసారి అడిగాను. ఆవిడ నవ్వి కౌంటర్లో ఫీజ్ కట్టండి. పాస్పోర్ట్ మీరిచ్చిన అడ్రెస్ కి పంపిస్తామన్నారు. భలే సంతోషం వేసింది. ఎందుకంటే పాపం నా ముందు వాళ్ళకి ఇవ్వలేదు. కౌంటర్లో లేడి ఉంటే వీసా ఇవ్వడంలేదావిడ అని బయట భయపెట్టారు. మెుత్తానికి మరుసటిరోజు నేనిచ్చిన మా పాతింటికి నా పాస్పోర్ట్ వచ్చింది. మేం అది తీసుకుని మా ఆఫీస్కెళ్ళి ఫ్రెండ్స్ ని కలిసి తిరిగి మా ఊరు వచ్చేసాము.

మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బట్టల షాపింగ్, కావాల్సిన పుస్తకాలు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసా. ప్రయాణం దగ్గర పడే సమయానికి బాగా జ్వరం వచ్చి ఓ వారం టికెట్ పోస్ట్ పోన్ చేయించుకున్నా. రెండు పెద్ద సూట్కేస్ లు, వెన్నెల ఓ చిన్న సూట్కేస్, హాండ్ బాగ్ లలో లగేజ్ సర్ధాలింక. 5,6 జతలు పాంట్, షర్ట్ లు, 4 చూడీదార్లు, 7,8 చీరలు, నైటీలు, లెదర్ జాకెట్...ఇలా అవసరమైన బట్టలు, దుప్పట్లు అన్నీ కలిపి 22 కేజీలు ఒక సూట్కేస్లో, చిన్న చిన్న వంట సామాన్లు, పచ్చళ్ళు, కారాలు, పుస్తకాలు మరోదానిలో 22 కేజీలు సర్ది, ఓ రెండు జతలు, డాక్యుమెంట్స్ అన్నీ హాండ్ లగేజ్ లో 4,5 కేజీలు సర్ధేశాం. హాండ్ బాగ్ లో వీసా పేపర్స్, పాస్పోర్ట్, ఫోన్ నెంబర్ బుక్,సోప్,బ్రష్, పేస్ట్ ఇలా అవసరమైనవి పెట్టుకున్నా.

ఇక ప్రయాణం రోజు రానే వచ్చింది. అందరిని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉన్నా తప్పని ప్రయాణమాయే...

మళ్ళీ కలుద్దాం...

 

1 -సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు...

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...


   ameikaa-visa-travleing=softwear-training-baggage handling