ఆంధ్రుల ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని నిలబడి ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చిన అన్న ఎన్టీఆర్ గురించి దశాబ్దాల వారీగా! 101 వ జయంతి సందర్భంగా!
Tue May 28, 2024 07:59 Wishes (శుభాకాంక్షలు)నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.
రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.
నందమూరి తారక రామారావు 1923, మే 28 న, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచారు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు.
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను అన్నగారికి వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశారు. థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవారు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.
1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
1956లో విడుదలైన మాయాబజార్‌లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని చెప్పవచ్చు. 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో అన్నగారు ఐదు పాత్రలు పోషించారు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసారు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసారు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయం సాధించాయి.
అన్నగారు క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు.
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు గా బిరుదాంకితుడై 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు. 1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు 'కళాప్రపూర్ణ ' స్వీకరించారు.
1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ లో తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.
1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? అని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పారు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.
అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసారు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 న కొత్త పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించారు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవారు. దానిని ఆయన "చైతన్యరథం" అని పిలిచేవారు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.
ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు. చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.
మహానాడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతీ సంవత్సరం మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఎన్. టి. ఆర్ 100 రూపాయల స్మారక నాణెం 28 ఆగస్ట్ 2023 న విడుదల చేశారు. జోహార్ అన్న ఎన్టీఆర్... జోహార్...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Wishes #NTR
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.