యాత్రా తరంగిణి 10: దగ దగా మెరిసిపోయే కాంతులతో మహాలక్ష్మి అమ్మవారు! వేలూరు గోల్డెన్ టెంపుల్
Wed Feb 14, 2024 14:37 Devotional, యాత్రా తరంగిణిరచయిత : కాపెర్ల పవన్ కుమార్, 9908300831
వేలూరు: తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ కొన్నివేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలే కాదు.. కొన్ని ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. ఆలాంటి ఆలయాలలో ఒకటి వేలూరు - శ్రీపురం లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. బంగారు దేవాలయం అంటే అంతకు ముందువరకూ అమృతసర్ లోని గురుద్వారా.. అయితే ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ స్థంభాలు బంగరం.. వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం, విమానం, అర్ధమంటపం, శటగోపం అన్నీ బంగారంతో చేసినవే.
ఇక్కడ వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణకవచాలు, కిరీటంతో స్వర్ణతామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి, సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం, ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది. ప్రతి శుక్రువారం గుడిని అందంగా అలంకరిస్తారు. ఈ ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది.
గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం మొత్తం నక్షత్రం ఆకారం గల ప్రాకారంతో ఆవరించబడి ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుంచి సేకరించిన శ్లోకాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు. శ్రీ విద్య అనే ప్రాచీనమైన, అరుదైన శక్తి పూజా విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శ్రీ శక్తి అమ్మ. ఈయన అసలు పేరు సతీశ్ కుమార్. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్ ఒకమిల్లు కార్మికుడు. తల్లి టీచర్. 1976 లో జన్మించిన సతీశ్‌కుమార్ చిన్నప్పటి నుంచీ అందరు పిల్లల్లా చదువూ ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తి అమ్మగా పేరుమార్చుకున్నారు. 1992 లో నారాయణి పీఠాన్ని స్థాపించారు.
ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి అమ్మవారు (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరుపున ఉచిత వైద్యశాల, పాఠశాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడం, అన్నదానం ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. శక్తి అమ్మ భక్తులు దేశవిదేశాల్లో విస్తరించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టరై వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ స్వర్ణదేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే.
శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణీ దేవాలయం వ్యయపరంగా, విస్తీర్ణం పరంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం కంటే చాలా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. ఈ వ్యయంతో పోలిస్తే బంగారం కొనేందుకు పెట్టిన ఖర్చు తక్కువ.
శ్రీపురం స్వర్ణ మందిరం నిర్మాణపరంగా ఒక ఆధ్యాత్మిక అద్భుతం. దేశంలోని అన్ని ప్రధాన నదుల నుండి పవిత్ర జలాన్ని 'సర్వతీర్థం' అనే చెరువును నిర్మించారు. ఈ స్వర్ణ మందిరం 100 ఎకరాల పచ్చని ప్రకృతి దృశ్యంలో ఒక నక్షత్ర ఆకారపు మార్గం మధ్యలో ఉంది. ఇది నక్షత్రాకారంలో ఉండటం వలన ప్రకృతి నుండి అత్యుత్తమ శక్తిని గ్రహిస్తుంది, అపారమైన శాంతిని సృష్టిస్తుంది.
నిర్మాణానికి అవసరమైన బంగారం కొనుగోలులో పారదర్శకతను పాటించారు. రిజర్వ్‌బ్యాంకు అనుమతి పొంది, మినరల్స్ అండ్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేశారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల స్థపతి శ్రీనివాసన్‌ల పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం కొనసాగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు తాపడంలో పాలుపంచుకున్న వారితో పాటు మరో 400 మంది రేయింబవళ్లు కష్టపడితే, దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.
ఈ ఆలయానికి రాజగోపురం ఉంది. తిరుమల ఆలయంలాగే చుట్టూ 36 స్తంభాలున్నాయి. మధ్యలో ఉన్న షాండ్లియర్ పూర్తిగా బంగారంతో చేసిందే. ఆలయ ప్రాంగణంలో 30 వేల మొక్కలు, ఉద్యానవనాల్లో లక్ష మొక్కలు నాటారు. అందమైన ఫౌంటెన్‌లు అదనపు హంగుల్ని చేకూరుస్తున్నాయి. ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహంతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు. ఈ ఆలయంలో ఎలాంటి నామస్మరణలు చేయకూడదు. ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి, వెలుపలికి వచ్చే వరకూ భక్తులు మౌనం పాటించాలి.
శ్రీపురం దక్షిణ భారతదేశంలోని వేలూరు సమీపంలో తిరుమలైకోడి అనే చిన్న గ్రామంలో చుట్టూ దట్టమైన, సుందరమైన పర్వతాలను కలిగి ఉంది. తిరుమలైకోడి చెన్నై నుండి 150 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి మరియు తిరువన్నామలై.. రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుండి సమాన దూరంలో ఉంది. సరళ రేఖలతో అనుసంధానించబడినప్పుడు ఈ మూడు పట్టణాలు త్రిభుజంగా ఏర్పడతాయి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!
యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!
యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?
యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?
యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం
యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు
యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...
యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...
#andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.