యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!

Header Banner

యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!

  Wed Feb 07, 2024 21:55        Devotional, యాత్రా తరంగిణి

రచయిత : కాపెర్ల పవన్ కుమార్, 9908300831

కాణిపాకం: ఏ గ్రామానికైనా గణపతి మొదట గ్రామదేవతగా చెప్తారు. నమ్మశక్యంగా లేదు కదూ! పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ లాంటి గ్రామ దేవతల పేర్లు మనకు చిరపరిచితం. కానీ వినాయకుడు కూడా ఒకప్పుడు గ్రామదేవత. ఇది నిజమని చెప్పే కధనాలు, స్తోత్రాలు ఉన్నాయి. మొదట పాళెగార్లుగా ప్రజల్ని కొల్లగొట్టినవారే, క్రమంగా రాజులు, చక్రవర్తులుగా మారిన దాఖలాలు ఎన్నో చరిత్రలో ఉన్నాయి. అలా గణపతిని మొదట ఆటవిక జాతులు “గణ నాయకుడి” గా కొలిచి ఉంటారు. మహా గణపతి సహస్ర నామంలో ఉన్న ‘ప్రతి గ్రామాధి దేవతా’ అనే నామం ఇందుకు తార్కాణం. ఒక దశలో గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆరాధించేవారు.


కాలక్రమంలో వినాయకుడు అందరికీ ఆరాధ్య దేవుడయ్యాడు. ఇలా జరిగి కూడా వేల వేల సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు గణపతి విగ్రహం లేని పూజామందిరం వుండదు. గణేశుని పూజించకుండా ఏ పనీ ప్రారంభించరు. అలాగే గణపతి మొదట విఘ్నకారి. తర్వాతికాలంలో విఘ్న నాశకుడు అయ్యాడు. అంటే వినాయకునిలో రెండు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. గణపతి అంటే ప్రజలకు భక్తితోబాటు భయమూ ఉంది.


ఇంటి గుమ్మం మొదలు, పూజామందిరం వరకూ గణేశుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ముందుగా వినాయకుని పూజిస్తారు. ఆఖరికి హిందూ మతాన్ని ద్వేషించిన ఔరంగజేబు పూనా దగ్గర్లో ఉన్న వినాయకుని దేవాలయానికి మాన్యాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే, గణపయ్య ప్రభావం ఎంతటిదో చూడండి. గణేశుని పట్ల ఇతర మతస్తులకు కూడా భక్తి భావం కలుగుతుంది.


ఇక కాణిపాక క్షేత్రం విషయానికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కి.మీ ల దూరంలో వుంది. ఈ ఆలయం లోని వినాయకుడు రోజురోజుకు పెరుగుతూ మహిమ చూపిస్తున్నారు. మరి ఆ కాణిపాక వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం. సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నాడు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.


ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా పూజించేది వినాయకుడినే. వినాయకుని పూజ చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుని ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుని స్వయంభూ అంటారు.


కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.


ఎంత తవ్వినా స్వామి వారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడు కాణిపాకం విఘ్నేశ్వరుడు ముందు ప్రమాణం చేయడానికి అబద్ధికులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తావా? అంటూ సవాల్ విసరడం నా చిన్నతనం నుంచి ఎన్నో సార్లు విన్న మాటే.
ఇక్కడ చేసిన ప్రమాణాలు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తమ తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి. అలా ఒప్పుకోక పొతే వినాయకుడు వారిని శిక్షిస్తారని భక్తుల నమ్మకం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..! 


కాణి అంటే పావు ఎకరం మడి భూమి లేదా మాగాణి అని తమిళ అర్థం. పారకం అంటే నీళ్లు పారడం అని అర్థం. చరిత్ర ప్రకారం సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు.


ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది.


జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.. ఈ రోజుకీ ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలో ఉంటుంది. అక్కడ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది దీనిలో స్వామి వారి వాహనం ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకు ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.


స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మరకతంభికా సమేత శ్రీ మణి కంఠేశ్వర ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు.


ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దీంతో కాణిపాకం హరి హర క్షేత్ర మైనది.


ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక నాగుపాము తిరుగుతూ ఉంటుందంటారు. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పం, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగపై మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడ అర్చకులు, భక్తులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయాన్ని చోళ రాజు రాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద విశ్వకర్మ శిల్పి శైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది.

 

మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు. స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి తూర్పు ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

రచయిత :

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలిదర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటిప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యతవిశిష్టతవిశేషాలు... వారం వారం మీకోసం...

 

యాత్ర తరంగిణి 8: దేవాలయాలకు రాతి గడప ఎందుకు ఉంటుంది! ఆ గడపను తొక్కవచ్చా? ప్రదక్షణం వెనకున్న పరమార్ధం!

  

యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!

 

యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడుఎక్కడ ప్రతీష్టించాలిశాస్త్రం ఏం చెబుతుంది?

 

యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుందిసైన్స్ దాగుందా?

 

యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

 

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

 

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలువాటి నిర్మాణాలు ఎలా ఉంటాయిఉపయోగాలు ఏమిటి...

 

యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారంప్రదక్షిణం తప్పనిసరా...


   #andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality