యాత్రా తరంగిణి 14: 41 రోజులు కఠిన దీక్ష! మకర జ్యోతి దర్శనం! ఎంతో ప్రసిద్ధి చెందిన శబరిమల క్షేత్రం!
Wed Mar 13, 2024 21:16 Devotional, యాత్రా తరంగిణిరచయిత: కాపెర్ల పవన్ కుమార్, 9908300831
శబరిమల
ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్య క్షేత్రాల జాబితాలో హజ్ లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే, శబరిమలది రెండోస్థానం అని చెప్పవచ్చు. శబరిమల కేరళ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, భక్తులు అయ్యప్పను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. కేరళ లోని పాతానంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో శబరిమల క్షేత్రం ఉంది. శబరిమల సముద్ర మట్టం నుంచి 3000 అడుగుల ఎత్తులో, దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ, మకరజ్యోతి శబరిమల యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజున శబరిమల లో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచి ఉంచుచుతారు.
అయ్యప్ప దీక్ష యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. మండల పూజకు హాజరయ్యే వారు తప్పని సరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈ యాత్రలు స్వాములు ఒక గురుస్వామి (5 సార్ల కంటే ఎక్కువ సార్లు మాల దరించిన వారు) నాయకత్వంలో ఒక బృందంగా బయలుదేరి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది.
కేరళలో "కుళతుపుళ"లో అయ్యప్ప స్వామిని బాలుని రూపంలో పూజిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది.
పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం దారి మాత్రమే ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.
సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819) లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించారు. ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది.
ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరు దేవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి మలయాళీ పండుగదినాలలో కూడా తెరవడం ప్రారంభించారు.
శబరిమల పూర్తిగా కొండల ప్రాంతము.. చాలా భయంకరమైనది. పూర్వము ఆ ప్రాంతములోనే మహామునులు తపస్సు కొరకై అనేక ఆశ్రమాలు నిర్మించుకున్నారు. క్రూరమృగములు నివశించే ఆ భయంకరమైన అడవి ప్రాంతములో పంబానదికి అతి సమీపములో ఐదుకొండల సమూహములో ఉన్న శబరి కొండపై హరిహరసుతుడు, అఖిలాండకోటి భాహ్మండ నాయకుడు, అనాధ రక్షకుడు, ఆపత్భాంధవుడు, ఆశ్రిత జన రక్షకుడు, కలియుగ వరదుడు, శ్రీ ధర్మశాస్త్రావారు, మణికంఠుడిగా భూలోకంలో అవతరించి పందలరాజుకు ముద్దుల తనయుడై, పులిపాల కొరకు అడవికి వెళ్లి మహిషి అనే రక్షసిని సంహరించి, వావర్ అనే బందిపోటును తన భక్తునిగా మార్చి, శబరి తల్లికి మోక్షాన్ని ప్రసాదించి అతి కష్టతరమైన పట్టబందాసముతో చిన్ముద్రధారిగా అభయహస్తముతో అష్టాదశ సోపానములపై కూర్చున్న ఏకాంతవాసుడు శ్రీ అయ్యప్ప స్వామి వారిని శబరిమలైలో శబరి పీఠం పై చూస్తూ ఉంటే భక్తి పారవశ్యంతో తనువు పులకరిస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు చేసే శరణుఘోషతో సన్నిధానము నలుమూలలు మారుమ్రోగుతూ ఉంటుంది.
నియమ నిబందనల ప్రకారము కఠినమైన దీక్ష చేసి సజ్జన సాంగత్యముతో దేవాలయాలలోను, పవిత్రమైన స్థలములలోను, స్వామివారి పూజలలోను, భగవంతుని నామాన్ని జపం చేస్తూ దీక్షను సాగించాలి. అలా దీక్ష చేసి శబరిమలై యాత్రకు వెళ్లి సత్ఫలితాన్నిచే అయ్యప్పస్వామి వారి కృపా కటాక్షమును పొందుతారు. అందువల్ల అయ్యప్పదీక్ష శబరిమలై యాత్రలో ఎంతో పవితమైనది. మహిశాసురుని జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ తనకు చావులేనట్లు వరం పొందింది. అంతేకాదు అలా జన్మించిన హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి.
క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతం దేవతలు, రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించాడు శ్రీమహావిష్ణువు. అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం అయ్యాడు. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా నది తీరాన మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.
అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందళ రాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం చెందాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్లాడు. శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది. ఆయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ‘అయ్యా’ అని మరికొందరు ‘అప్పా’ అని, ఇంకొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యబుద్దులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషుడిగా గుర్తించినా, ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు.
గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు. అది ఇష్టం లేని తల్లి తలనొప్పి అని నాటకమాడి, ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్లి పులిపాలు తీసుకు వస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తోన్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు. మహిషి గేదే రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడకు చేరుకున్నారు.
ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్య జరిగిన భీకరయుద్ధంలో మహిషిని నేలపై విసిరికొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్రా! నేను పులి పాలు తెచ్చే నెపంతో వచ్చాను. కాబట్టి మీరందరూ పులులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా పులిగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే, తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త' గా భక్తుల అభిమానాన్ని చూరగొన్నాడు.
శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు. 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్ర తంత్రాలతో అమర్చడం జరిగింది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కిన తర్వాత క్యూలో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు. కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.
1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది. శబరిమలలో వంశపారంపర్య ముఖ్య పూజారిని తంత్రి అని పిలుస్తారు. వీరిని పరశురాముడు పూజ కొరకు కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం, శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని ఎంపిక చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి, అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు. స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు.
ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తీసుకురావడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది 65 రోజులు దీక్షలో ఉండి, తిరువాభరణాలను శబరిమలకు మోసుకువస్తారు. వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరువాభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. ఇరుముడి లేకుండా పదునెనిమిది మెట్లు ఎక్కడానికి తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారికి మాత్రమే మినహాయింపు ఉంది. మళ్ళీ జనవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.
అయ్యప్ప భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదీ ఆయన మహిమ. స్వామియే శరణం అయ్యప్ప..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం!
యాత్రా తరంగిణి 10: దగ దగా మెరిసిపోయే కాంతులతో మహాలక్ష్మి అమ్మవారు! వేలూరు గోల్డెన్ టెంపుల్
యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!
యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!
యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?
యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?
యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం
యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు
యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...
యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...
#andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.