యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్ ఆలయ ప్రత్యేకతలు!
Wed Feb 28, 2024 21:31 Devotional, యాత్రా తరంగిణిరచయిత: కాపెర్ల పవన్ కుమార్, 9908300831
గురువాయూరు
గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలో ఉంది. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో నారాయణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో పూజింపబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మములను ధరించి తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్, బాలకృష్ణుడు, ఉన్నికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు. ఇక్కడి విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులైన గురువు - వాయువులు పేరు మీద ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా పిలుస్తారు.
ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి.
స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని నుండి ఈ విగ్రహాన్ని బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారు. ఆ తరువాత భక్తులు ఇచ్చిన విరాళాలతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు.
గురువాయురప్పన్ బాలకృష్ణుడి రూపంలో భక్తులకు, అర్చకులకు కలలో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన కథలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.
ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ, స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు, కొబ్బరి ఉండలు, కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం, పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. బంగారంతో చేసిన స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీ లోపల ఆలయం చుట్టూ మూడు సార్లు ఊరేగించి తీసుకొస్తారు.
గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామి సమక్షంలో వివాహ బంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని మనం ఊహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్ అనే ఏనుగుల గురించి గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపింది. 1931 లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్. అచ్చం దానిలానే స్వామిని సేవించేది. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేది. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976 లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించింది కేశవన్. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్ కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగుల వరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు.
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం!
యాత్రా తరంగిణి 10: దగ దగా మెరిసిపోయే కాంతులతో మహాలక్ష్మి అమ్మవారు! వేలూరు గోల్డెన్ టెంపుల్
యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!
యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!
యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?
యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?
యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం
యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు
యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...
యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...
#andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.