యాత్రా తరంగిణి 15: కోటానుకోట్ల విలువచేసే పసిడి, వజ్ర, వైఢూర్యాలు! అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు!

Header Banner

యాత్రా తరంగిణి 15: కోటానుకోట్ల విలువచేసే పసిడి, వజ్ర, వైఢూర్యాలు! అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు!

  Wed Mar 27, 2024 11:55        Devotional, యాత్రా తరంగిణి

రచయిత: కాపెర్ల పవన్ కుమార్, 9908300831

 

త్రివేండ్రం (తిరువనంతపురం)
శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||

 

అనంత పద్మనాభ స్వామి అనగా నాభి నందు పద్మం కలవాడని అర్ధం. శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభుడుగా వెలసిన పుణ్య క్షేత్రం కేరళలోని తిరువనంతపురం. ఆలయ గర్భగుడిలో ప్రధాన దైవం అయిన అనంత పద్మనాభుడు అనంతశయన భంగిమలో దర్శనమిస్తాడు. శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం యొక్క కూర్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క గర్భగుడి మొత్తం ఒక రాతి పీఠంపై ఉంటుంది. ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా చూస్తే తల భాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో తామర పువ్వు, మూడో ద్వారం గుండా చూస్తే పాదాలు కనిపిస్తాయి.

 

తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం కందశరకారతో తయారు అయ్యింది. అంటే మూలికలు, జిగురు పదార్ధాలు, మట్టితో తయారు చేయబడింది. ముందుగా ఈ ఆలయాన్ని చెక్కతో నిర్మించారు. అనంతరం గ్రానైట్ వినియోగించారు. ఈ రోజు ఉన్న ఆలయం గ్రానైట్ నిర్మాణంతో ఉన్నదే. ఈ ఆలయంలో 365 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం సంవత్సరం లోని ఒక్కో రోజును సూచిస్తుంది. ఇక ఆలయంలోని ప్రధాన విగ్రహం తయారీకోసం 12,500 సాలిగ్రామ రాళ్లను నేపాల్‌లోని గండకీ నది తీరం నుంచి తీసుకొచ్చారు. సాలిగ్రామ శిలలు చాలా పవిత్రమైన రాళ్లు. భక్తులు వీటిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

 

అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరునే తిరువనంత పురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు ఈ ఆలయ నిర్వహణ చూసుకునే వారు. ఆ తర్వాత ఈ ఆలయం ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి అధికార చిహ్నంగా పెట్టుకున్నారు. ట్రావెన్ కోర్ రాజకుటుంబం చేర వంశానికి చెందిన వారు, కులశేఖర ఆళ్వార్ సంతతి వారు. 1750లో, మార్తాండ వర్మ ట్రావన్కూరు సంస్థానాన్ని పద్మనాభుడికి అంకితం ఇచ్చాడు. విష్ణుమూర్తి తరఫున రాజకుటుంబం రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని మర్తాండ వర్మ ప్రకటించారు. ఆయన మరియు ఆయన వారసులు పద్మనాభ దాసులు, పద్మనాభ స్వామి సేవకులుగా రాజ్యానికి సేవ చేశారు. అప్పటి నుంచి ప్రతి ట్రావెన్‌కూర్ రాజు చివర పద్మనాభదాస అనే పేరు వచ్చింది. పద్మనాభ స్వామికి ట్రావెన్‌కూర్ సంస్థానం ఇచ్చిన దానాలను తిరిపడిదానంగా పేర్కొంటారు.

 

ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమద్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు, అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది. క్రీ.శ 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది.

 

ఆలయ గర్భగుడిలో ప్రధాన మూర్తి పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర) ఉంటాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. స్వామివారి గురించి 12 మంది అళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్ధిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్యపూజలు అందుకున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. ఆ కాలంలో 4 వేల మంది శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, 100 ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది.

 

పురాతన ఆలయాలన్నింటికీ అపారమైన సంపదలున్నాయి. ఆస్తులు కొదవ లేదు. వేలాది ఎకరాల భూములు, నగదు ఉండటం మామూలే. అయితే అనంత పద్మనాభుడి ఆస్తులు ఇతర దేవాలయాలతో పోల్చదగినవి కాదు. తిరుమలేశుని సంపద కంటే ఎక్కువే. ఇటీవల దేవాలయంలోని నేలమాళిగలో బయట పడిన నిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనంత పద్మనాభుడి ఆలయంలో ధన కనక రాశులను భద్రపరిచే రహస్య భూ గృహాలు ఆరున్నాయి. వీటిలో దేవుడి సంపద కొంత దాగుందని ఒకప్పుడు కొందరికి, ఇప్పుడు అందరికీ తెలిసిన రహస్యం. ఈ సంపదను ఎప్పుడూ ఎవరూ లెక్కించిన ఆనవాళ్లు లేనట్లే. రాళ్లతో మూసివుండే ఈ గదుల్లో కొన్నింటిని తెరిచి దాదాపు 150 ఏళ్లు దాటిపోయింది. 1860 లో కొన్ని గృహాలను ఏదో కారణం వల్ల మూసి వేశారు. 1950 లో కొన్నింటిని సీల్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆలయాలన్నింటినీ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికి, పద్మ నాభస్వామి ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులు తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఇప్పటికీ ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకులే దీని కార్య నిర్వహణ ట్రస్టీలుగా కొన సాగుతున్నారు.

 

మర్తాండ వర్మనే దేవాలయంలో మురజపం మరియు భద్రదీపం వంటి పండుగలను ఆలయంలో ప్రవేశపెట్టారు. మురజపం అనేది, నిరాఘాటంగా పూజలు చేయడం, ఇది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒక్కసారి దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఏడు పరుశురామ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లే ప్రదేశంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి భూమి దేవాలయాన్ని ఉన్నట్లుగా విశ్వసిస్తారు. ఈ దేవాలయానికి సంబంధించి స్కంద పురాణం మరియు పద్మ పురాణం వంటి పురుణాల్లో కూడా ప్రస్తావన ఉంది. దేవాలయం దగ్గరలో ప్రసిద్ధ కోనేరు పద్మపాదం ఉంది. ట్రావెన్‌కూర్ రాజకుటుంబానికి చెందిన ట్రస్టీల ద్వారా ఈ దేవాలయం ప్రస్తుతం నిర్వహించబడుతోంది.

 

దేవాలయంలో రాతి మరియు కంచుతో చేసిన కళారూపాలు కనిపిస్తాయి. దేవాలయం లోపలి భాగంలో అందమైన పెయింటింగ్‌లు మరియు మురల్ చిత్రాలుంటాయి. వీటిలో పవళించే భంగిమలో ఉండే విష్ణుమూర్తి, నరసింహ స్వామి చిత్రాలు చాలా ప్రసిద్ధి. దేవాలయం యొక్క ధ్వజస్తంభం సుమారు 80 అడుగులఎత్తు ఉంటుంది. దీనికి బంగారం పూత పూయబడ్డ రాగిరేకులు తాపడం చేయబడ్డాయి. ఈ దేవాలయంలో బలిపీఠ మండపం మరియు ముఖ మండపం వంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. వివిధ హిందూ దేవతామూర్తుల యొక్క అందమైన శిల్పాలతో ఈ మండపాలు అలంకరించబడ్డాయి.

 

వైష్ణవుల ఆరాధ్యదైవం పద్మనాభుడు. చారిత్రక నేపథ్యం, పౌరాణిక విశిష్టత సంతరించుకున్న సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం తిరువనంతపురం. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం అక్కడ కట్టబడిన, అత్యంత పురాతనమైన అనంత పద్మనాభుడి ఆలయం ఒకప్పుడు “ఎట్టువీట్టిల్ పిల్ల మార్” అనే ఎనిమిది కుటుంబాల వారి నిర్వహణలో వుండేది. తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని 1566 లోనే నిర్మించారు. నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకు ఉంటుంది.

 

ఆదిశేషుడిపై యోగనిద్రలో వుండే విగ్రహం, ఎదుట వుండే మండపం పై కప్పు ఒకే ఒక్క గ్రైనేట్ రాయితో మలచింది. ట్రావెన్ కోర్ రాజు తమ ఇలవేల్పుగా భావించిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు, నిత్యం ఆలయానికి వెళ్లడం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. ఆలయం లోని స్తంభాలపై అనేక రకాల శిల్పాలు చెక్క బడి వుంటాయి. విష్ణుమూర్తి ఇక్కడ మూడు భంగిమల్లో శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని దర్శనం ఇస్తారు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. తమిళ ఆళ్వారుల ప్రబంధాల్లో ఈ ఆలయం ప్రస్తావన కనిపిస్తుంది. ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.

 

“పద్మ నాభ” అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం. యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా, ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది. గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక, కుడి, ఎడమ గోడల మీద అపురూపమైన దేవతామూర్తుల చిత్రాలు ఉంటాయి. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు ఉత్సవ మూర్తుల విగ్రహాల్ని కూడా భక్తులు దర్శించుకునే వీలుంటుందిక్కడ. ఆలయంలో నరసింహ, అయ్యప్ప, గణపతి, శ్రీకృష్ణ, హనుమ, విష్వక్సేన, గరుడ ఆలయాలు కూడా ఉన్నాయి. శిల్పాలు, పంచ లోహాలు, చెక్కలో అందంగా మలచిన దేవతామూర్తులు ఈ ఆలయంలో దర్శనం ఇస్తాయి.

 

గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి. ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం. శిల్పుల కళా ప్రతిభ అంతా ఇక్కడ పోత పోసుకుందా అనిపిస్తుంది.

 

ద్రావిడ శైలి వాస్తు శిల్ప శాస్త్రం ఆధారంగా నిర్మించిన పద్మనాభ మందిరం వివరాలు చాలా వరకు మధ్య కాలీన తమిళ ఆళ్వారుల దివ్య ప్రబంధాలలో చెప్పడం జరిగింది. ఆరు-ఏడు శతాబ్దాల కాలంలో రూపు దిద్దుకున్న ఈ దేవాలయ నిర్మాణం, మధ్య యుగపు చేరా వంశీ యుల కాలం వరకూ మార్పులూ చేర్పులూ చోటుచేసుకుంటూ, పదహారవ శతాబ్దిలో గోపురం కట్టేంతవరకు కొనసాగింది. ఆ మాటకొస్తే, పద్ధెనిమిదవ శతాబ్దంలో కూడా పునరుద్ధరణ పనులు జరిగాయక్కడ. కేరళ రాష్ట్ర రాజధాని “తిరువనంతపురం” పేరు కూడా ఈ దేవాలయంలోని దేవుడి పేరు ఆధారంగానే వచ్చింది. “తిరు అనంత పురం” అంటే, అనంత పద్మనాభ స్వామి నిలయమైన పవిత్ర స్థలం అని అర్థం. భారత దేశాన్ని పాలించిన రాజుల్లో, చేరా రాజవంశం అతి ప్రాచీనమైన రాజ వంశంగా చరిత్రకారులు అంటుంటారు.

 

చోళులతోను, పాండ్యులతోను కలిసిన చేరా రాజవంశీయులు, ఉమ్మడిగా దక్షిణ భారతంలోని మూడు ప్రధాన తమిళ రాజ్యాలను నెలకొల్పారు. సంగం తరం రాజ వంశీ యుల కంటే ముందు నుండి, పన్నెండవ శతాబ్దం వరకు దక్షిణ భారత దేశాన్ని ఏలిన చేరా రాజులు, తమ పరోక్ష వారసులుగా వేనాడ్ చేరా వంశస్త్తులుగా తయారు చేశారు. చేరా రాజ వంశం వారసులే ఐన, కులశేఖర వంశానుక్రమం నుంచి వచ్చిన “ట్రావన్ కోర్ రాజులు” “పద్మనాభ సేవకులు” గా తమను తామే భావించుకుని, అనంత పద్మనాభ స్వామి దేవాలయం నిర్వహణ బాధ్యతలు నిర్వహించుకుంటూ వస్తున్నారు అనాదిగా.

 

కేరళ రాష్ట్రంలోని పదకొండు దివ్య ప్రదేశాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటని తమిళ ఆల్వార్ ప్రబంధ గ్రంధాలలో వుంది. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ-నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. ఎనిమిదవ శతాబ్దపు ఆల్వార్ కవి “నమ్మాళ్వార్” పద్మనాభ స్వామి దేవాలయం గురించి పొగడుతూ, నాలుగు శ్లోకాలను, ఒక ఫల శృతిని తన రచనలలో పొందుపరిచారు. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల-ఏడంతస్తుల గోపురం పునాదులు 1566 లోనే పడ్డాయి. “పద్మ తీర్థం” అనే విశాలమైన చెరువు సరస్సును ఆనుకుని వుంటుంది దేవాలయం. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది. ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది. తూర్పు దిక్కుగా వున్న ప్రధాన ద్వారం సమీపంలో, గోపురం కింది భాగానున్న మొదటి అంతస్తును “నాటక శాల” అని పిలుస్తారు. మళయాళం పంచాంగం ప్రకారం, మీనం, తులం నెలల్లో, ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే “పది రోజుల ఉత్సవాల” లో భాగంగా, దేవాలయ కళకు సంబంధించిన “కథాకళి” కార్యక్రమాన్ని ఈ నాటక శాలలోనే ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు.

 

అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాల గ్రామాలను, నేపాల్ లోని గండకి నది ఒడ్డునుంచి ఏనుగులపై వూరేగించుకుంటూ అక్కడకు తెచ్చారట. ప్రతి సాల గ్రామం పైన ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని, అతకడానికి వీలయ్యే ప్లాస్టర్ లాగా ఉపయోగించారట. క్రిమి కీటకాల నుంచి విగ్రహం కాపాడబడ్డానికి అలా చేశారంటారు. నిత్యం జరిగే పూజా కార్యక్రమాలకు పుష్పాలను ఉపయోగిస్తారు. అభిషేకానికి ఉత్సవ విగ్రహాలనే వాడుతారక్కడ. గర్భ గుడి ముందుండే ఎత్తైన ప్రదేశాన్ని “ఒట్టక్కళ్ మండపం” అంటారు. పూజ చేయాలన్నా, దర్శనం చేసుకోవాలన్నా, ఆ మండపం ఎక్కాల్సిందే. దర్శనం కావాలంటే, మూడు ద్వారాలు దాటాల్సిందే. ఒక్క ట్రావన్ కోర్ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ. ఆ రాజులు మాత్రమే “పద్మనాభ సేవకులు” గా పిలువ బడుతారు. శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో, మూడు భంగిమల్లో ఏదో ఒక భంగిమలో మాత్రమే స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మాత్రం, శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు స్వామి. ఆయుర్వేద మిశ్రమం ఉపయోగించడానికి కూడా బలీయమైన కారణం వుంది. ముస్లిం రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి దాన్ని ఉపయోగించి వుండొచ్చు.

 

పద్మనాభ స్వామి దేవాలయం పుట్టు పూర్వోత్తరాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారక్కడి వారు. “విల్వ మంగళతు స్వామియార్” గా ప్రసిద్ధికెక్కిన దివాకర ముని, శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కొరకు ప్రార్థన చేశాడట. ఆయనను కరుణించేందుకు, భగవంతుడు, మారు రూపంలో-ఒక అల్లరి పిల్లవాడుగా దివాకర ముని వద్దకు వచ్చాడు. ముని పూజలో వుంచిన ఒక సాల గ్రామాన్ని తీసుకుని మింగడంతో, కోపంతో పిల్ల వాడిని తరిమికొట్టగా, ఆ రూపంలో వున్న శ్రీ కృష్ణుడు సమీపంలో వున్న ఒక చెట్టు పక్క దాక్కున్నాడు. మరు క్షణమే పడిపోయిన ఆ వృక్షం, విష్ణు మూర్తిగా మారి పోయి, శయన భంగిమలో అనంత శయనంగా యోగ నిద్రా మూర్తి తరహాలో కనిపించింది. అలా జరిగిన ఆ సందర్భంలో, ఆయన రూపం ఆకారం ఎంతో పెద్దగా వుండడంతో, దివాకర ముని, అంత పెద్ద ఆకారాన్ని పూర్తిగా తన తనివి తీరా దర్శించుకోలేక పోతున్నానని, దాంట్లో మూడో వంతుకు తగ్గమని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలను అంగీకరించిన భగవంతుడు, అలానే తగ్గిపోయి, తనను దర్శించుకోవాలంటే, మూడు ద్వారాల గుండా మాత్రమే వీలుంటుందని అంటాడు. ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమంటారు. ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన పవిత్ర స్థలంలో, పద్మనాభ స్వామి దేవాలయం వుందని మరొక నమ్మకం. స్కంద, పద్మ పురాణాలలో, ఈ దేవాలయానికి సంబంధించిన విశేషాలున్నాయి.

 

కేరళలో అత్యంత ప్రధానమైన పండుగ ఓనం. ఏటేటా, ఆ పండుగను పురస్కరించుకుని, శతాబ్దాల కాలం నుంచి, తమిళనాడులోని కాంచీపురం నుండి తిరువనంతపురం వలస వచ్చిన, సంప్రదాయ కుటుంబ కళాకారులు, పద్మనాభుడుకి అపురూపమైన కాల్పనిక చిత్రాలను కానుకగా ఇచ్చే సంప్రదాయం వుంది. చెక్కలపై విష్ణుమూర్తి అవతారాల కాల్పనిక చిత్రాలను, అత్యంత రమణీయంగా రూపొందించి, “ఓనవిల్లులు” గా పిలువబడే ఈ బహుళ రంగుల చిత్ర కళాఖండాలను, ఆలయంలో జరుపుకునే ఓనం సంబరాల సందర్భంగా, “తిరువోనం” రోజున, భగవంతుడికి సమర్పించు కుంటారు. పద్దెనిమిదవ శతాబ్దంలో, పద్మనాభ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించిన, నాటి ట్రావెన్ కోర్ రాజు మార్తాండ వర్మ పిలుపు మేరకు, తమిళనాడు నుంచి వచ్చి పని చేసిన, “వణియమ్మూల విలాయిల్” కుటుంబీకుల సంతతికి చెందిన ఈ తరం ప్రధాన కళాకారుడు, బిన్ కుమార్, నాటి పరంపరను ఈ ఏడాది కూడా కొనసాగించే పనిలో తమ కుటుంబీకులు నిమగ్నమై వున్నారని అంటున్నారు. సుమారు వేయి చిత్రాలకు పైగా తయారు చేసి, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరుగనున్న ఓనం పండుగ కల్లా, అనంత పద్మనాభుడుకి కానుకగా అందచేసే ప్రయత్నంలో కళాకారులున్నారు.

 

ఆలయ సంపద నిర్వహణలో అక్రమాలు నెల కొన్నాయని, వీటిని గాడిలో పెట్టాలని సుందర రాజన్ అనే న్యాయవాది 2011 లో, సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దేవాలయాన్ని నిర్వహించే ట్రస్టుకు, ఆస్తులు సంరక్షించే శక్తి సామర్థ్యాలు లేవని సుందర రాజన్ తన పిటీషన్లో ఆరోపించారు. అగ్నిమాపక దళం శాఖకు చెందిన ప్రభుత్వాధికారులను, పురావస్తు శాఖకు చెందిన అధికారులను, గర్భ గుడిలోని రహస్య గృహాలను తెరిచి తనిఖీ చేసి చూడాల్సిందిగా, వారికి కనిపించిన వస్తువులేంటి తేల్చాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ సంపద లెక్కింపు మొదలవడం, రోజు రోజుకూ అపార ధన కనక రాశులు కోకొల్లలుగా బయటపడడం బయట పడ్డ విలువ తెలుసుకున్న కమిటీ సభ్యులు వారి ద్వారా యావత్ ప్రపంచం ఆశ్చర్య పోవడం విశేషం.

 

ఆలయ నేల మాళిగలలో గదుల నుంచి వెలికి తీసిన టన్నుల కొద్దీ బంగారం, బంగారు వజ్రా భరణాలు, వజ్ర-వైఢూర్యాలు, దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు, పురాతన బంగారు వెండి నాణాలు, కోట్లాది రూపాయల విలువ చేసే విష్ణుమూర్తి బంగారు విగ్రహం, బంగారంతో చేసిన ఏనుగు బొమ్మ, కేజీల కొద్దీ ఇతర బంగారు విగ్రహాలు, వేలాది కంఠాభరణాలు, గొలుసులు, కమిటీ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సంచుల్లో భద్రపరిచిన 16వ శతాబ్దం నాటి శ్రీ కృష్ణదేవరాయల కాలం నాణాలు, ఈస్టిండియా కంపెని, నెపోలియన్ కాలాల నాటి నాణాలు కూడా లభ్యమయ్యాయంటున్నారు. బంగారు గొలుసులు, బంగారు టెంకాయలు, స్వర్ణ శంఖాలు, తదితర చిత్ర విచిత్రమైన పురాతన వస్తువులు అక్కడ లభ్యం కావడం ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా నేలమాళిగలో నిక్షిప్తమై పోయాయి. మానవ మాత్రులెవ్వరూ, ఇప్పటి వరకు, కనీ వినీ ఎరుగని, కళ్లారా ఒక్క చోట చూడని “అనంతమైన సంపద”, పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడింది. ఆలయంలో లభ్యమైన సంపద ఇన్ని లక్షల కోట్ల రూపాయలని, విదేశీ కరెన్సీలో ఇన్ని బిలియన్ల డాలర్లేనని చెప్పడం అవివేకం తప్ప మరేమీ కాదు. ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో! విలువ కట్టడానికి, ఆ సంపదేమన్నా బహిరంగ మార్కెట్లో అమ్మే అంగడి సరుకు కాదు కదా! అందుకే కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి అంతులేని ఆ వింత సంపదంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు.

 

అనంత పద్మనాభ స్వామి ఆలయ నేల మాళిగల్లోంచి బయటపడిన అపార నిధులన్నీ దేవ దేవుడి ఆస్తులని, ఆ సంపద రాజ కుటుంబానికి గానీ, భక్తులకు గానీ చెందదని, ప్రభుత్వానికీ దానిపై అధికారం లేదని ఒకప్పటి తిరువాన్కూర్ మహారాణి రాణీ గౌరీ లక్ష్మీబాయి అంటున్నారు. ఐదు గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ ఐదు గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంత కాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులకుగా ఉంటున్నారు. వెల కట్టనేలని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు.

 

రచయిత: కాపెర్ల పవన్ కుమార్

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలిదర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటిప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యతవిశిష్టతవిశేషాలు... వారం వారం మీకోసం... 

 

యాత్రా తరంగిణి 14: 41 రోజులు కఠిన దీక్ష! మకర జ్యోతి దర్శనం! ఎంతో ప్రసిద్ధి చెందిన శబరిమల క్షేత్రం! 

 

యాత్రా తరంగిణి 13: హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా భావించే శబరిమల - ఎరుమేలి శ్రీ ధర్మ శాస్తా ఆలయం! అసలు కథ ఏమిటి?

 

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

 

యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం! 

 

యాత్రా తరంగిణి 10: దగ దగా మెరిసిపోయే కాంతులతో మహాలక్ష్మి అమ్మవారు! వేలూరు గోల్డెన్ టెంపుల్
 

యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!

 

యాత్ర తరంగిణి 8: దేవాలయాలకు రాతి గడప ఎందుకు ఉంటుంది! ఆ గడపను తొక్కవచ్చా? ప్రదక్షణం వెనకున్న పరమార్ధం!

  

యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!

 

యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడుఎక్కడ ప్రతీష్టించాలిశాస్త్రం ఏం చెబుతుంది?

 

యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుందిసైన్స్ దాగుందా?

 

యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

 

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

 

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలువాటి నిర్మాణాలు ఎలా ఉంటాయిఉపయోగాలు ఏమిటి...

 

యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారంప్రదక్షిణం తప్పనిసరా... 


   #andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality