యాత్రా తరంగిణి 16: రాముడి పాపాలను ప్రక్షాళన చేసిన లింగం! రామేశ్వర క్షేత్రం యొక్క విశేషాలు!
Wed Apr 03, 2024 11:49 Devotional, యాత్రా తరంగిణిరచయిత: కాపెర్ల పవన్ కుమార్, 9908300831
రామేశ్వరం
రామేశ్వరం జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన ప్రదేశం. రామేశ్వరం భారత దేశానికి దక్షిణ తీరంలో ఉంది. భగవంతుడిని పూజించడానికి మూడు లక్షణాలు ఉండాలని పెద్దలు చెప్తారు.. అవి -
1. మూర్తి,
2. స్థలము,
3. తీర్థము..
అవి మూడు రామేశ్వరంలో ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత.
జ్యోతిర్లింగ శ్లోకాలలో సేతు బంధేతు రామేశ్వరం అనే పాదం ఈ క్షేత్రానికి సంబంధించినదే. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరలింగం ఏడవది. రామేశ్వరం తమిళనాడు లోని రామనాథ పురం జిల్లాలో పంబన్ అనే దీవిలో ఉంది. రామేశ్వరం నాలుగు ప్రక్కలా సముద్రమే ఉంటుంది. పంబన్ అనే అతి పొడవైన బ్రిడ్జి ద్వారా మాత్రమే మనము రామేశ్వరాన్ని చేరవలసి ఉంటుంది. రామేశ్వరం దీవి లో ధనుష్కోటి నుండి శ్రీలంక లోని మల్లైతీవు అనే ప్రదేశానికి కేవలం 18 నాటికల్ మైళ్ళ దూరంలో ౩౦ కి.మీ. దూరంలో ఉంటుంది.
రామేశ్వరాన్ని దర్శించిన తర్వాతే కాశీ యాత్ర ఫలం సిద్ధిస్తుంది. దక్షిణాన ఉన్న రామేశ్వర లింగానికి ఉత్తరాన ఉన్న కాశీయాత్రకు సంబంధం ఉంది. కాశీ యాత్ర చేసే వారు కాశీలోని గంగా జలాన్ని తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలపాలని అప్పుడే కాశీ యాత్ర పూర్తవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కాశీ తో పాటుగా రామేశ్వరాన్ని చేరడం వలన ఈ క్షేత్రం చార్ ధామ్ యాత్రలో ఒక భాగంగా చెప్పబడింది. శ్రీరాముడు లంకను చేరడానికి నిర్మించిన వారధి ఇక్కడి నుండే మొదలవుతుంది. లంకలోని రావణుడు శివ భక్తుడు... అందుకే ఈ క్షేత్రం శివ కేశవుల మధ్య వారధిగా అనుకోవచ్చు. ఇక్కడి శివుడిని రామేశ్వరుడని, రామలింగమని, రామనాథుడని అంటారు.
లంకాధిపతి యైన రావణుడు సీతను చెరబట్టి లంకయందు ఉంచగా, ఆమెను రక్షించుటకై శ్రీరాముడు రామేశ్వరము నుండి లంకకు బయలు దేరి వెళ్ళినట్లు చరిత్ర చెబుతుంది. రాముడు రావణుని సంహరించడం వలన ఏర్పడిన బ్రహ్మహత్యాపాపము దాని దోష నివారణ చేయమని ఈశ్వరుని ప్రార్థించాడు. దానికై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింప సంకల్పించారు. అందుకే తగిన లింగాన్వేషణకై హనుమంతుని కైలాస పర్వతానికి పంపుతారు. హనుమ ఆ అన్వేషణలో ఎంతకూ తిరిగి రావడం లేదు. ఈలోగా ఆలస్యమవుతుందని సీతమ్మ వారు ఇసుకతో లింగాన్ని(సైకత లింగం) చేసి ప్రతిష్ఠించారు.
ఈ లోగా హనుమంతుల వారు లింగాన్ని తీసుకువస్తారు. తిరిగి వచ్చిన హనుమంతుడు తన లింగాన్ని ప్రతిష్ఠించకముందే ప్రతిష్ఠింప బడిన ఆ లింగాన్ని చూసి ఆగ్రహో దగ్రుడై తన తోకతో దాన్ని పెకిలించ ప్రయత్నంచేస్తాడు. కానీ ఆ లింగం సీతమ్మవారి హస్త మహత్యంతో తయారు చేయబడినది కాబట్టి బయటకు రాలేదు. రాముల వారు హనుమంతుని బుజ్జగించి ఆ లింగాన్ని కూడా ఒక దగ్గర ప్రతిష్ఠించి, “హనుమా దీనినే విశ్వ లింగమని పిలుస్తారు. మొదట నీవు ప్రతిష్ఠించిన లింగానికి పూజ జరిగిన తర్వాతే నేను ప్రతిష్టించిన లింగాన్ని దర్శించుకుంటారని శ్రీ రాముల వారు మాట ఇచ్చారట. ఇప్పటికీ ఈ విధంగానే మనము దర్శించుకుంటున్నాము. హనుమ ప్రతిష్ఠించిన లింగాన్ని విశ్వ లింగమని, సీతమ్మవారు ప్రతిష్ఠించిన లింగాన్ని రామ లింగమని పిలిస్తారు.
ఈ గుడి క్రీ.శ. 17 శతాబ్ధంలో నిర్మించారు. ద్రవిడ శిల్ప కళా రీతిలో ఈ దేవాలయాల శిల్ప కళ ఉంటుంది. ద్వీపం యొక్క సముద్ర తీరాన మూడు మండపములు చాలా అందమైన స్థంభములతో, వాటిపైన చెక్కబడిన అత్యద్భుత శిల్పములతో వరుసలుగా విరాజిల్లుతున్నాయి. దేవాలయము 865 అడుగుల పొడవు, 657 అడుగుల వెడల్పు ఉంది. పై కప్పు 49 అడుగుల పొడవుగల రాతి దూలములతో మోయబడుచున్నది. గర్భగుడి పాలిష్ చేయబడిన గ్రానైట్ రాయితో కట్ట బడింది. దేవాలయపు ప్రక్కన మూడు మండపములు మొత్తము 4,000 అడుగుల పొడవున ఉండడంతో ప్రపంచంలోని అద్భుతాలలో ఇది ఒకటిగా చెప్పబడుతుంది. మండపం ఇరువైపులా ఐదు అడుగుల ఎత్తు పీఠాలు, దానిపై 25 అడుగుల ఎత్తు గల రాతి స్థంభములు ఉన్నాయి.
దేవాలయ మండపం 1200 స్థంభముల పై నిర్మింపబడింది. దేవాలయ తూర్పు గోపురం 130 అడుగులు, పశ్చిమ గోపురం 80 అడుగుల ఎత్తు ఉన్నాయి. మధ్య మధ్యలో ఇరవైరెండు పవిత్ర తీర్థాలలో స్నాన మాచరిస్తూ సాగుతుంది పయనం. అవన్నీ చాలా అధ్బుతమైన బావులు. ఇక్కడి అన్ని బావులలో స్నానమాచరిస్తే అన్ని దోషాలు, పూర్వజన్మ పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని నమ్మకం. ఒక విశేషమేమంటే, ఏ రెండు బావులలోని నీరు ఒకే రుచి కలిగి ఉండవు.
రాముడి దేవుడు ఈశ్వరుడా లేక రాముడే ఈశ్వరుడి దేవుడా?
‘రామచంద్రేణ సమర్చితం తం రామేశ్వరాఖ్యం సతతం నమామి’ అని రామేశ్వరుడి ప్రస్తావన ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రంలో ఉంది. రామేశ్వరుడు అనే పదంపై ఒక ఆసక్తికరమైన వివాదం ఉంది. వ్యాకరణం ప్రకారం ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. రామునికి ఈశ్వరుడైన (దేవుడైన) వాడు అని ఒక అర్థం, రాముడు ఎవరికి ఈశ్వరుడో (దేవుడో) అతడు అని మరొక అర్థం. రాముడు పూజించాడు కాబట్టి మా ఈశ్వరుడే గొప్ప అని శైవులు అంటారు. అలా కాదు, రాముడు ఎవరికి దేవుడో అతడు అని అర్థం కాబట్టి రాముడే గొప్ప అని వైష్ణవులు వాదించుకున్నారట.
దీనిపై రామభక్తులు నేరుగా రాముని వద్దకే వెళ్లి అడిగారట. అప్పుడు రాముడు వారితో.. “తత్పురుష సమాసం ప్రకారం రాముడికి దేవుడైనవాడు” అనే అర్థాన్ని చెప్పాడట. శివ భక్తులు వెళ్లి పరమ శివుడిని అడుగగా.. ‘బహువ్రీహి సమాసం ప్రకారం రాముడు ఎవరికి దేవుడో అతడు’ అని చెప్పాడట. ఇద్దరూ వినయశీలురే. తమను తాము గొప్పగా చెప్పుకోలేదు. ఇద్దరిలో భేదం లేదని వారికి తెలుసు. భక్తులకు ఏమి తోచక ఋషుల్ని అడిగారట. ఋషులు రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అంటూ కర్మధారయ సమాసంలో అర్థం చెప్పారట. ఈ వివాదాన్నంతటినీ ఒక చిన్న శ్లోకంలో ఇలా చెప్పారు.
‘రామః తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
రామేశ్వర పద ప్రాప్తే ఋషయః కర్మధారయమ్’
రామేశ్వరంలో వేసవికాలం వేడిగా మరియు తేమగా ఉంటుంది. తదనంతరం, వర్షాకాలం కూడా నగరంలో భారీ వర్షపాతాన్ని ఎదుర్కొంటుంది. అందువల్ల, రామేశ్వరంలో ప్రదేశాలను సందర్శించడానికి ఉత్తమమైన సమయం శీతాకాలం. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మీకు ఉత్తమమైనది, ఎందుకంటే ఈ సమయంలో ఇక్కడ చలి లేదా వేడి ఉండదు. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే మధురై మీదుగా రైలులో నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు విమానంలో వెళ్లాలనుకుంటే మధురై విమానాశ్రయంలో దిగి టాక్సీలో వెళ్లవచ్చు.
రచయిత: కాపెర్ల పవన్ కుమార్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
యాత్రా తరంగిణి 15: కోటానుకోట్ల విలువచేసే పసిడి, వజ్ర, వైఢూర్యాలు! అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు!
యాత్రా తరంగిణి 14: 41 రోజులు కఠిన దీక్ష! మకర జ్యోతి దర్శనం! ఎంతో ప్రసిద్ధి చెందిన శబరిమల క్షేత్రం!
యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం!
యాత్రా తరంగిణి 10: దగ దగా మెరిసిపోయే కాంతులతో మహాలక్ష్మి అమ్మవారు! వేలూరు గోల్డెన్ టెంపుల్
యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!
యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!
యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?
యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?
యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం
యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు
యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...
యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...
#andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.